Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 41

Story of Sagara 4 ( contd )!

పుత్త్రాంశ్చిరగతాన్ జ్ఞాత్వా సగరో రఘునందనః |
నప్తారమబ్రవీద్రాజా దీప్యమానం స్వతేజసా ||

స|| (హే)రఘునందనః ! సగరో పుత్రాన్ చిర గతాన్ జ్ఞాత్వా స్వ తేజసా దీప్తమానం నప్తారమ్ రాజా అబ్రవీత్|

బాలకాండ
నలుబదియొకటవ సర్గము
( సగరుని పుత్రుడు అంశుమంతుడు యజ్ఞాశ్వము తీసుకొని వచ్చుట)

విశ్వామిత్రుడు సగరుని కథ చెప్పసాగెను.

'ఓ రఘునందన! సగరుడు పుత్రులు వెళ్ళి చాలా కాలము అయినదని చింతనతో సగర మహారాజు , తేజస్వి అయి వెలుగొందుచున్న తన పౌత్రునితో తో ఇట్లుపలికెను. " నాయనా! నీవు శూరుడవు , అన్ని విద్యలూ నేర్చుకొనినవాడవు, తేజస్సు లో నీవు పూర్వీకులతో సమానము . నీ పినతండ్రులు ఎక్కడికి వెళ్ళిరో వారినీ , అశ్వమును , దానిని అపరించినవారినీ వెదుకుము. భూమిలోపల మహా బలముగల పెద్ద ప్రాణులు వుండును. నీవు వానిని హతమార్చుటకు ఖడ్గమును ధనస్సునూ తీసుకొనిపొమ్ము. నీవు అభివాదము చేయ తగినవారికి అభివాదము చేసి, విఘ్నము కలిగించువారిని హతమార్చి, లక్ష్యము సాధించి తిరిగి రమ్ము. నా యజ్ఞమును పూర్తిచేయుము. మహాత్ముడైన సగరునిచే ఇట్లు సముచితముగా చెప్పబడిన ఆ అంశుమంతుడు ఖడ్గమును ధనస్సు నూ తీసుకొని వేగముగా వెళ్ళెను'.

విశ్వామిత్రుడు మరల చెప్పసాగెను.

' ఓ నరోత్తమా ! రాజుచేత అదేశించబడిన అతడు( ఆంశుమంతుడు) పినతండ్రులు భూమిలో త్రవ్వి వెళ్ళిన మార్గమునే అనుసరించెను. అచట దైత్య దానవ రాక్షసులచేత పిశాచ పక్షి నాగులచేత పూజింపబడుచున్న మహాగజమును చూచెను. అతడు దానికి ప్రదక్షిణముచేసి , కుశలములు అడిగి , తన పినతండ్రులు ఆ యజ్ఞాశ్వముగురించి అడిగెను. ఆ దిగ్గజము అంశుమంతుని వచనములను విని ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను." ఓ అంశుమంతా త్వరలోనే కృతార్థుడవై యజ్ఞాశ్వముతో సహా వెళ్ళగలవు" అని.

అంశుమంతుడు ఆ దిగ్గజముయొక్క ఆ మాటలను విని , అదే క్రమములో అన్ని దిగ్గజములను అదే విధముగా వినయపూర్వకముగా ప్రశ్నించెను. వాక్యజ్ఞులు , వాక్య కోవిదులను , దేశకాలానుగుణముగా భాషించు తీరును గ్రహింపగల ఆ దిగ్గజములు అతనిని పూజించి ,' నీవు త్వరలోనే యజ్ఞాశ్వముతో వెళ్ళెదవు' అని చెప్పిరి. వాటియొక్క ఆ వచనములను విని అ విక్రముడు త్వరతగతిలో ఎక్కడ తన పినతండ్రులు భశ్మరాసి చేయబడినారో అచటికి వెళ్ళెను.

'అప్పుడు ఆ అసమంజసుని పుత్రుడు వారి వధతో మిక్కిలి దుఃఖితుడై దుఃఖముతో ఏడవసాగెను.
అప్పుడు పురుషవ్యాఘ్రుడు దుఃఖశోకసమన్వితుడు అయిన, ఆ అంశుమంతుడు దగ్గరలో అటునిటు తిరుగుచున్న యజ్ఞాశ్వమును చూచెను. అ దుఃఖమునుండి తేరుకొని తన పినతండ్రులకు తర్పణములు ఇచ్చుటకు నిశ్చయించెను. ఆ విధముగా రాజపుత్రులకు తర్పణములు ఇచ్చుటకు నీరు కోసము వెదుకుచున్న ఆ మహతేజొవంతునకి జలాశయము అచట కనపడలేద'.

విశ్వామిత్రుడు చెప్పసాగెను:

'ఓ రామా ! అప్పుడు తన దృష్టిని అటునిటు ప్రసారింపగా తన పినతండ్రులకు మేనమామ వాయువేగముకలవాడు అగు ఖగరాజు కనిపించెను. ఆ మహబలవంతుడగు వైనతేయుడు ఇట్లు పలికెను. " ఓ పురుషవ్యాఘ్ర ! శోకింపకుము. ఈ వథ లోకసమ్మతము ప్రకారము జరిగెను. అప్రమేయుడగు కపిలమహాముని చే వీరు దగ్ధము చేయబడిరి . లోకమర్యాదానుసారము వీరికి తర్పణములు విడువతగదు . ఓ పురుషర్షభ ! గంగ హిమవంతుని జ్యేష్ట పుత్రిక. ఓ మహాబాహో ఆ గంగా నదిలో పిత్రుతర్పణములను విడువుము. భస్మము చేయబడిన వీరిని లోకపావని అయిన గంగ పావనము చేయును. భస్మము గంగాజలముచే తడుపబడగా ఆ అరువదివేల రాజకుమారులు స్వర్గమునకు చేరుదురు. ఓ మహాభాగా ! పురుషర్షభా ! ఆ అశ్వమును తీసుకొని పొమ్ము. ఓ వీరా ! పితామహును యజ్ఞము పూర్తిచేయుంచుటకు అర్హుడవు ". ఆ వీరుడైన అంశుమంతుడు ఆ ఖగరాజు వచనములను విని ఆ అశ్వమును తీసుకొని యజ్ఞభూమికి తిరిగి వచ్చెను.

' ఓ రఘునందన ! యజ్ఞదీక్షలోనున్న ఆ రాజుకు ఆవృత్తాంతమంతయూ , ఖగరాజు వచనములను కూడా చెప్పెను. అంశుమంతుడు చెప్పిన అ భయంకరవార్తను వినిన ఆ రాజు యథావిథి గా యజ్ఞమును నిర్వర్తించెను. ఆ శ్రీమంతుడైన ఆ మహీపతి యజ్ఞకర్మలను పూర్తిచేసి తన పురమునకు వచ్చెను. గంగను తీసుకువచ్చుటగురించి ఒక నిశ్చయమునకు రాలేకపోయెను'.

'ముప్పది వేల సంవత్సరములు రాజ్యము చేసి , గంగగురించి నిశ్చయము చేయకుండా ఆ మహారాజు కాలవశమున దివంగతుడాయెన".

|| ఈ విథముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండలో నలభై ఒకటి స్వర్గ సమాప్తము ||

||ఓమ్ తత్ సత్ ||

అకృత్వా నిశ్చయం రాజా కాలేన మహతా మహాన్ |
త్రింశద్వర్ష సహస్రాణి రాజ్యం కృత్వా దివంగతమ్ ||

తా|| ముప్పది వేల సంవత్సరములు రాజ్యము చేసి , గంగగురించి నిశ్చయము చేయకుండా ఆ మహారాజు కాలవశమున దివంగతుడాయెను.

|| ఓమ్ తత్ సత్ ||



|| Om tat sat ||